బీఆర్ఎస్ నేత బొల్లం అజయ్ మణికంఠ
వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : ఈనెల 20న జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభను ప్రతి ఒక్కరూ బాధ్యతగా విజయవంతం చేయాలని మాజీ జడ్పీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షులు, బీఆర్ఎస్ నేత బొల్లం అజయ్ మణికంఠ పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సభ ఏర్పాట్లు మరియు రాజకీయ పరిణామాలను వివరించారు. తెలంగాణ ఉద్యమాలకు పురుడుపోసిన గడ్డ జగిత్యాల అని, ఇక్కడి నుండే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని అజయ్ మణికంఠ ధ్వజమెత్తారు. కేసీఆర్ గారి హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఈ సభ మరోసారి చాటిచెబుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ బహిరంగ సభ వేదికగా మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డితో పాటు వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆయన వెల్లడించారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతమని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల నాయకత్వంలో పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఆరు నూరైనా సభను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. జగిత్యాల గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడేలా ప్రతి కార్యకర్త సభకు తరలిరావాలని అజయ్ మణికంఠ పిలుపునిచ్చారు.
