వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండలోని శ్రీనగర్ కాలనీలో ఆదివారం నిర్వహించిన “ఇవా కిడ్స్ ఆర్ట్ ఎక్స్ పో-2026” సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇవా స్కిల్ షేర్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కళా ప్రదర్శనలో 6 నుండి 16 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న 40 మంది చిన్నారులు పాల్గొని తమ అద్భుత సృజనాత్మక ప్రతిభను చాటుకున్నారు. బాల కళాకారులు స్వహస్తాలతో రూపొందించిన రంగురంగుల చిత్రాలు, పెయింటింగ్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్ ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, సీనియర్ కళాకారులు ఈ ఎక్స్‌పోను సందర్శించి, చిన్నారుల ప్రతిభను చూసి అబ్బురపడ్డారు. ఇంత చిన్న వయస్సులోనే అద్భుతమైన కళాఖండాలను సృష్టించిన చిన్నారులను వారు ప్రత్యేకంగా అభినందించారు. బాల్యంలోనే ఇటువంటి కళలను ప్రోత్సహించడం వల్ల వారిలో దాగివున్న సృజనాత్మకత మరింత వెలుగులోకి వస్తుందని ప్రముఖులు పేర్కొన్నారు. చిన్నారుల్లోని నైపుణ్యాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ ఎక్స్‌పోలో చిత్రాల ప్రదర్శనతో పాటు విక్రయాలు కూడా జరిగాయి. దీని ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో 70 శాతాన్ని ఆయా చిత్రాలను గీసిన చిన్నారులకే అందజేయగా, మిగిలిన 30 శాతం నిధులను సామాజిక సేవా కార్యక్రమాలకు కేటాయించినట్లు నిర్వాహకులు హిందు ప్రియ, అఖిలేష్ తెలిపారు. చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, ప్రదర్శనను సందర్శించి విజయవంతం చేసిన నగర ప్రజలకు, కళాభిమానులకు నిర్వాహకులు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
