డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్
ఘనంగా మేజర్ ధ్యాన్ చంద్ జయంతి వేడుకలు
వరంగల్ వాయిస్, హనుమకొండ: క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతోపాటు దేశభక్తి భావనను బలోపేతం చేస్తాయని హనుమకొండ జిల్లా యువజన, క్రీడా అధికారి (డీవైఎస్ఓ) కొత్త ప్రశాంత్ అన్నారు. భారత హాకీ దిగ్గజం, ‘హాకీ మాంత్రికుడు’ మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ (జేఎన్ఎస్) స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ‘ఖేలేగా భారత్–జీతేగా భారత్’ నినాదంతో ఆగస్టు 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజులపాటు వివిధ క్రీడా, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శుక్రవారం జరిగిన ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొత్త ప్రశాంత్.. మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత హాకీకి ప్రపంచవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు తీసుకువచ్చిన మహనీయుడు మేజర్ ధ్యాన్ చంద్ అని కొనియాడారు. ఆయన క్రీడా స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకుని జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. హనుమకొండ జిల్లాలో క్రీడల అభివృద్ధికి, ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు యువజన, క్రీడా శాఖ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. మూడు రోజుల వేడుకల్లో భాగంగా శనివారం జేఎన్ఎస్ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవ ప్రతిజ్ఞ నిర్వహించనున్నట్లు కొత్త ప్రశాంత్ తెలిపారు. అనంతరం అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బాక్సింగ్ తదితర క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వేడుకల్లో చివరి రోజైన ఆదివారం ప్రజల్లో ఆరోగ్యం, ఫిట్నెస్పై అవగాహన కల్పించే ఉద్దేశంతో భారీ స్థాయిలో ‘స్పెషల్ సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సైకిల్ రైడ్లో క్రీడాకారులు, యువత, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మూడు రోజుల కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు జిల్లా క్రీడా శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీవైఎస్ఓ తెలిపారు. సంబంధిత కోచ్లు తమకు కేటాయించిన క్రీడా కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్ఏ కోచ్లు, క్రీడాకారులు, స్టాఫ్, సిబ్బంది పాల్గొన్నారు.
