దామెర మండలంలో యథేచ్ఛగా తవ్వకాలు..
పట్టించుకోని అధికారులు?
కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారనే ఆరోపణలు
సామాన్యులకే నిబంధనలు.. అక్రమార్కులకు మాత్రం వర్తించవా?
అనుమతులు లేకున్నా ఉన్నట్లు బుకాయింపులు
చోద్యం చూస్తున్న సంబంధిత శాఖల అధికారులు?
పర్యావరణ పరిరక్షణకు యువత ముందడుగు
అక్రమ తవ్వకాలను ప్రశ్నిస్తే బెదిరింపులంటున్న యువకులు
మొరం దందాతో కనుమరుగవుతున్న గుట్టలు
వరంగల్ వాయిస్, దామెర: దామెర మండలంలో అర్ధరాత్రి వేళ అక్రమ మొరం తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ నిబంధనలు, అనుమతులు ఉన్నాయా లేదా అన్న విషయాలను పట్టించుకోకుండా కొందరు అక్రమంగా మొరం తవ్వకాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు సైతం బేఖాతరు చేస్తూ అక్రమ దందా కొనసాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణ ప్రజలు చిన్నపాటి పనుల కోసం మట్టి, మొరం తరలించాలంటే అనేక నిబంధనలు చెబుతున్న అధికారులు, పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు లేకున్నా ఉన్నట్లు చెబుతూ కొందరు తప్పించుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు అర్ధరాత్రి సమయంలో మొరం వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ సంబంధిత శాఖల అధికారులు ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్రమ తవ్వకాల కారణంగా గుట్టలు క్రమంగా కనుమరుగవుతున్నాయని, ప్రకృతి సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం మండలంలోని యువత ముందుకు వచ్చి అక్రమ మొరం తవ్వకాలపై ప్రశ్నిస్తోంది. అయితే అక్రమాలను ప్రశ్నించిన యువతను బెదిరింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, మైనింగ్, రెవెన్యూ, అధికారులు సమన్వయంతో స్పందించి మండలంలో జరుగుతున్న మొరం తవ్వకాలు, రవాణాపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అనుమతులు ఉన్నాయా? లేదా? తవ్వకాలు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయా? అనే అంశాలను పరిశీలించి, అక్రమాలు నిజమని తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రకృతి సంపదను కాపాడాల్సిన బాధ్యత అధికారులదే కాదా? అక్రమ మొరం దందాకు అడ్డుకట్ట ఎప్పుడు పడుతుంది? అన్నది వేచి చూడాలి. దీనిపై వరంగల్ వాయిస్ రిపోర్టర్ ఫోన్ లో మైనింగ్ శాఖ అధికారులను వివరణ కోరగా మా నుండి ఎవరికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు.
