Tuesday, September 22, 2026
HomeHanamkondaపాదయాత్ర కాదు.. పొర్లుదండాలు యాత్ర చేసినా కేటీఆర్‌ను ఎవరూ నమ్మరు

పాదయాత్ర కాదు.. పొర్లుదండాలు యాత్ర చేసినా కేటీఆర్‌ను ఎవరూ నమ్మరు

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్, హనుమకొండ : తెలంగాణలో తిరిగి పట్టు సాధించేందుకు కేటీఆర్ చేపడుతున్న ప్రయత్నాలపై కాంగ్రెస్ నాయకులు, మాజీ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం శివపటేల్ ఘాటుగా స్పందించారు. కేటీఆర్ పాదయాత్ర చేసినా, చివరకు పొర్లుదండాల యాత్ర చేసినా తెలంగాణ ప్రజలు ఆయనను పట్టించుకునే పరిస్థితిలో లేరని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్‌గా మార్చినా వచ్చే ప్రయోజనం ఏమీ లేదని శివపటేల్ పేర్కొన్నారు. “పేరు ఏదైనా సరే, తెలంగాణ ప్రజలు ఇప్పటికే ఆ పార్టీకి శాశ్వతంగా వీఆర్ఎస్ ఇచ్చేశారు. కల్వకుంట్ల కుటుంబం అంటేనే కుట్రలకు కేరాఫ్ అడ్రస్. పదేళ్ల పాలనలో అమరవీరుల కుటుంబాలను, ప్రజా సంఘాలను, ఉద్యోగులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసిన చరిత్ర వారిది” అని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించడంపై స్పందిస్తూ.. “రేవంత్ రెడ్డి ఆకాశం లాంటి వాడు. ఆకాశం వైపు చూసి ఉమ్మేస్తే అది తిరిగి మీ మొహంపైనే పడుతుంది. ఆ ఉమ్మిని తుడుచుకోలేక, కడుక్కోలేక కేటీఆర్ ఇబ్బంది పడాల్సి వస్తుంది” అని హెచ్చరించారు. గత పదేళ్లు అధికార గర్వంతో సొంత పార్టీ నేతలను కూడా పట్టించుకోని కేటీఆర్, ఇప్పుడు కొత్తగా ‘కొంగ జపం’ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కేటీఆర్ మాటలను నమ్మే స్థితిలో లేరని, ఇప్పటికైనా సిగ్గులేని పనికిమాలిన రాజకీయాలు మానుకోవాలని శివపటేల్ హితవు పలికారు. ప్రజలను వంచించిన వారికి కాలమే సమాధానం చెబుతుందని, తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular