ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు
వరంగల్ వాయిస్, మహాదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వారోత్సవాల్లో భాగంగా రెండో రోజు ‘యోగ, మానసిక ఆరోగ్యం’ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మెంటల్ హెల్త్ కన్వీనర్ వేముల రమేష్ ఆధ్వర్యంలో, కళాశాల ప్రిన్సిపాల్ జన్ను విజయకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో డాక్టర్ వినయ్, డాక్టర్ నిఖిత ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వినయ్ మరియు డాక్టర్ నిఖిత మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. కోపం, ఆందోళన, నిరాశ, ఒత్తిడి వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఆవేశపడకుండా శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. శారీరక ఆరోగ్యం బాగుంటేనే మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుందని వారు వెల్లడించారు. మానసిక ప్రశాంతత కోసం విద్యార్థులు పాటించాల్సిన పలు అంశాలను వారు వివరించారు. నిత్యం యోగా, ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించి, వ్యాయామంపై దృష్టి సారించాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో మనసు విప్పి మాట్లాడటం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. మద్యపానం, మత్తు పదార్థాల వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో సమయం గడపడం ద్వారా భయం, నిద్రలేమి సమస్యలను అధిగమించవచ్చు. తీవ్రమైన మానసిక ఒత్తిడి ఎదురైనప్పుడు ఏమాత్రం సంకోచించకుండా నిపుణులైన కౌన్సిలర్ల సహాయం తీసుకోవాలని వారు విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
