లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి
వరంగల్ వాయిస్, దామెర : మండల పరిధిలోని ఊరుగొండ గ్రామ శివారులో జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌లోని మొక్కలకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్‌ను వెనుక నుండి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ భయంకర ప్రమాదంలో లారీ డ్రైవర్ లారీ క్యాబిన్‌లోనే నలిగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా కిల్లా ఘనపూర్ మండలం రుక్కన్నపల్లి గ్రామానికి చెందిన నక్క బాలయ్య (40) లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఆయన లారీతో గుడెప్పాడ్ వైపు వెళ్తుండగా, ఊరుగొండ వద్ద జాతీయ రహదారి డివైడర్ మధ్యలో ఉన్న మొక్కలకు నీళ్లు పడుతున్న వాటర్ ట్యాంకర్‌ను లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు లారీ ముందుభాగం పూర్తిగా నలిగిపోయింది. దీంతో డ్రైవర్ నక్క బాలయ్య తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ ముసూఫ్ కార్తీక్, క్లీనర్ గోపాల్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పరకాల రూరల్ సీఐ సుధాకర్ రెడ్డి, దామెర ఎస్సై కొంక అశోక్ తమ సిబ్బందితో కలిసి యుద్ధప్రాతిపదికన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ కావడంతో, తక్షణమే క్రేన్ సహాయంతో ధ్వంసమైన వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. అయితే, లారీ క్యాబిన్ ముక్కల మధ్య నలిగిపోయి ఉన్న డ్రైవర్ నక్క బాలయ్య మృతదేహాన్ని బయటకు తీసేందుకు స్థానికులు ఎవరూ ముందుకు రాకపోవడంతో సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై అశోక్ గార్లు స్వయంగా రంగంలోకి దిగారు. చొరవ తీసుకుని తమ చేతులతో మృతదేహాన్ని క్యాబిన్ నుండి బయటకు తీసి, అంబులెన్స్‌లోకి ఎక్కించి మానవత్వాన్ని చాటుకున్నారు. పోలీసుల ఆత్మీయ తీరును అక్కడి వాహనదారులు, గ్రామస్థులు అభినందించారు. తీవ్రంగా గాయపడిన క్లీనర్, మరో డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ ముసూఫ్ కార్తీక్ నిర్లక్ష్యంపై మృతుడి భార్య నక్క అరుణ ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దామెర ఎస్సై కొంక అశోక్ విలేకరులకు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
