దాని కోసం తెలంగాణ రక్షణ సేన ముందుకు సాగాలి
ఆత్మీయ సమ్మేళనంలో కోరబోయిన విజయ్ కుమార్
వరంగల్ వాయిస్, హనుమకొండ: తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజా హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన ప్రజల్లోకి వెళ్లి బలోపేతం కావాలని కోరబోయిన విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈరోజు హనుమకొండలోని వడ్డేపల్లి బండి బ్యాంక్వెట్ హాల్లో బండారి సుమన్ ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ జాగృతి సంయుక్తంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరబోయిన విజయ్ కుమార్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను విదేశాల్లో ఉన్నప్పటికీ తన మనసు ఎప్పుడూ తెలంగాణ గడ్డతోనే ఉంటుందని, తెలంగాణ నేల, ప్రజలు, సంస్కృతి, ఉద్యమం పట్ల తనకు ఎంతో అభిమానం, ఆత్మీయత ఉన్నాయని తెలిపారు. తెలంగాణ అనేది కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదని, అది ప్రజల ఆత్మగౌరవం, పోరాటం, చరిత్ర, అస్తిత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంతోమంది యువకులు తమ జీవితాలను అంకితం చేశారని, అనేక కుటుంబాలు ఉద్యమంలో భాగస్వాములయ్యాయని గుర్తుచేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంలో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించిందన్నారు. ముఖ్యంగా బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో పాటు తెలంగాణ భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు చేసిన కృషి అభినందనీయమని అన్నారు. తెలంగాణ రక్షణ సేన ప్రారంభించిన ప్రజా ప్రయాణం కేవలం రాజకీయ ప్రయాణం కాదని, ప్రజల హక్కులు, సామాజిక న్యాయం, తెలంగాణ ఆత్మగౌరవ పరిరక్షణ కోసం సాగాల్సిన ఉద్యమమని స్పష్టం చేశారు. కవితక్క నాయకత్వం పార్టీకి దిశానిర్దేశం చేస్తుందని, ఆమె ఆలోచనలు, పోరాట పటిమ కార్యకర్తలకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత, రైతులు, కార్మికులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల సమస్యలపై పార్టీ నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని, వారిని గౌరవించి ప్రోత్సహించినప్పుడే పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. అంతర్గత విభేదాలకు తావులేకుండా అందరూ ఒక కుటుంబంలా ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు. విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలు సైతం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, సంస్కృతి పరిరక్షణలో తమ వంతు భాగస్వామ్యం కావాలని కోరారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలందరినీ తెలంగాణ రక్షణ సేనతో అనుసంధానం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కవితక్క నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేనను ప్రతి గ్రామం, మండలం, జిల్లా స్థాయికి విస్తరించాలని, యువతలో ఉద్యమ స్ఫూర్తిని నింపుతూ మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. క్రమశిక్షణ, ఐక్యత, నిబద్ధతతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ ఆత్మీయ సమ్మేళనం కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపాలని, ప్రజా సమస్యల పరిష్కారం, తెలంగాణ ఆత్మగౌరవ పరిరక్షణ కోసం సమష్టిగా కృషి చేయాలని కోరుతూ కార్యక్రమ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షులు నడిపల్లి వెంకటేశ్వరరావు, తానిపర్తి తిరుపతిరావు, తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మారిపల్లి మాధవి, సోమేశ్వరరావు, రాజిరెడ్డి, శ్రీశైలం, రవికుమార్, సొల్ది కిషోర్, విజయ, నిశాంత్ రావు, గుండ్రెడ్డి రోహిత్, రమేష్తో పాటు తెలంగాణ రక్షణ సేన జిల్లా నాయకులు, తెలంగాణ జాగృతి నాయకులు, నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.
