పత్తి కొనుగోళ్ల మారెబేరం..
మొక్కుబడి ధరతో రైతన్నకు మొదటికే మోసం..
కమీషన్ పేరా మరింత కోత..
చేండ్ల కాడిపత్తి చెండ్లకాన్నే మాయం..
అక్కరకు అమ్ముకుంటూ ఆగమవుతున్న అన్నదాత..
వరంగల్ వాయిస్, దామెర : దొరికిందే సందని, ఇదే అదను అని నొక్కుడూ ధ్యేయంగా తంతు సాగిస్తున్న వ్యాపారుల హవా ఇది. అమాయకత్వపు రైతుల అవసరాలను ఆసరాగా తీసుకుని, ఆర్థిక ఇబ్బందులను సాకుగా భావించి వ్యాపారాన్ని సాగిస్తూ పొట్టగొడుతున్న దళారుల దందా ఇది. పల్లెటూర్లలో పంట చేతికొచ్చి అమ్మకానికి సమయం లేకనో, ఖర్చులు భరిస్తూ కొద్దికొద్దిగా అమ్మడం ఎందుకు ఒకేసారి ఎక్కువ మొత్తంలో మార్కెట్ కు తీసుకెళ్తామని భావించి ఇంట్లోనే పెట్టుకుంటున్న తీరునో పసిగట్టిన మోసగాళ్లు రంగంలోకి దిగి అందినకాడికి నొక్కుతూ రైతుకు మొక్కుబడిగా చెల్లిస్తున్న తీరు బాధాకరం. ఆరుగాలం కష్టపడి పనిచేసిన అన్నదాతలు పత్తిని మార్కెట్ కు తీసుకెళ్లడానికి కాస్త వెనకాముందు ఆలోచనలో ఉన్నారనే విషయాలను గమనించిన వ్యాపారులు తమ ఏజెంట్లను రంగంలోకి దించి లావాదేవీలు కానిస్తున్నారు.
అంతా అక్కడే..
రైతుల ఇండ్లలోనో, కొట్టాల్లోనో, చేండ్లదగ్గరో నిల్వ చేస్తున్న పత్తిని వ్యాపారులు అనామకపు ధరతో కొనుగోళ్లు చేస్తూ భారీగా మోసానికి తెర దీస్తున్నారు. మార్కెట్ కు తరలిస్తే అయ్యే ఖర్చులు, రానుపోను వేస్ట్ అయ్యే సమయం, ఇంటి దగ్గర పనికి చెడుతున్న తీరును వివరిస్తూ రైతులను డైలమాలో పడేసి వ్యాపారాన్ని హాయిగా కొనసాగిస్తున్నారు. చెండ్ల దగ్గరే కొనుగోళ్లు చేస్తే తేమ, పదను తో సంబంధం లేదు, చేతికి పైసలిచ్చి పోతారనే ఆశను జూపి రైతును నిలువునా ముంచుతున్నారు. ఏవేవో పేర్లతో కోతలు పెట్టి, ఏమేమో తెలియని తిరకాసులతో ధరను మొక్కుబడిగా చెల్లించి, పత్తిని భారీగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెట్ లో ఉన్న రేటుకు వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేసి చెల్లిస్తున్న ధరకు పొంతనే లేకుండా పూటెల్లదీస్తున్నారు. పైగా చెల్లింపుల్లో కమీషన్ కూడా నొక్కుతూ, పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా, ఏదో ఓ ధరకు అమ్ముకోవాల్సిందే అనే మీమాంసలో రైతులు నిర్ణయం తీసుకోకముందే కొనుగోళ్లు చేసి సరుకును తరలిస్తూ చెప్పి మరీ దొంగతనం అన్నట్టుగా బిజినెస్ ను నడుపుతున్నారు.
దామెర మండలంలోని దామెరంచ, పులుకుర్తి, కానిపర్తి వంటి గ్రామాల్లో రైతుల ఇండ్లు, చేండ్ల వద్దే కాంటాలు జరుపుతున్న తంతు ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. మండల వ్యాప్తంగా ఎక్కడికక్కడ గద్దల్లా వాలిన దళారీలు వ్యాపారుల అవతారంలో వేలల్లో రైతులకు చెల్లించి, లక్షల విలువైన సరుకును తరలించుకుపోతున్నారు. చేనులో ఉన్న రైతన్న నిశ్చేష్టుడిగా ఉండగానే, ఒడ్డుమీద నిల్చున్న దళారీ జేబులు సవరించుకుంటూ పత్తిని ఎత్తుకెళ్లిపోతున్నారు. లైసెన్స్ లు లేకుండా ఇష్టారీతిగా వ్యాపారం చేస్తూ, పత్తిని మొక్కుబడి రేటుతో కొనుగోలు చేస్తున్న దళారీల భరతం పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పుట్టెడు అప్పులు జేసి పంట పండిస్తున్న రైతన్న దిగుబడి రాక ఆత్మహత్యలు చేసుకునే దయనీయ పరిస్థితిని అడ్డుకోవాల్సిన అవసరం అధికారులపై ఎంతైనా ఉంది. ఇప్పటికైనా దామెర మండల వ్యాప్తంగా జరుగుతున్న ఈ పత్తి కొనుగోళ్ల చీకటి వ్యాపారాన్ని చీల్చిచెండాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
