Friday, October 2, 2026
HomeHanamkondaదళితుల జోలికి వస్తే ఊరుకునేది లేదు

దళితుల జోలికి వస్తే ఊరుకునేది లేదు

📰 Generate e-Paper Clip

           రసమయి బాలకిషన్‌కు ఎస్సీ సెల్ నాయకుల తీవ్ర హెచ్చరిక

వరంగల్ వాయిస్, హనుమకొండ : “అణగారిన దళితుల పక్షాన ఉంటావా? లేక దళితులను అవమానపరిచే వర్గం పక్షాన ఉంటావా? రసమయి బాలకిషన్ ఖబడ్దార్” అని హనుమకొండ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్, ఇతర నాయకులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎస్సీ సెల్ నాయకులు కొడవటి రవి, నోముల ప్రశాంత్, గిన్నారపు రాజులు, ఆరూరి సాంబయ్య మాట్లాడారు. కేసీఆర్ సొంత కూతురు, అన్న కూతురు కూడా కేసీఆర్ వద్ద ఉన్నది అవినీతి సొమ్మేనని చెబుతున్నారని, దీనిని బట్టి ఆయన పదేళ్ల పాలనలో ఎంతగా దోచుకున్నారో స్పష్టమవుతోందని నాయకులు ఆరోపించారు. “ఇది రాజుల కాలం కాదు, కాలం మారింది. దళితుల జోలికి వస్తే సహించేది లేదు” అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలతో సబ్బండ వర్గాలకు మేలు చేస్తుంటే, చూసి తట్టుకోలేక కేసీఆర్, కేటీఆర్‌లు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో గజ్జె కట్టి, డప్పు కొట్టి, పాటలు పాడి ముందుండి నడిచింది దళితులేనని వారు గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక కేటీఆర్ దళితులను ఏనాడు పట్టించుకోలేదని, సిరిసిల్ల ప్రాంతంలో తమను దారుణంగా హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి నేరేళ్ల ఘటనే సజీవ సాక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడేనని నమ్మించి, తీరా అధికారం రాగానే పీఠం ఎక్కి దళితుల భూములు గుంజుకున్న చరిత్ర కేసీఆర్‌‌దని ధ్వజమెత్తారు. దళిత మంత్రులైన తాటికొండ రాజయ్యను ఉన్నపళంగా ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవి నుంచి తొలగించడమే కాకుండా, కొప్పుల ఈశ్వర్‌‌ను తీవ్రంగా అవమానపరిచారని విమర్శించారు. అంతేకాకుండా శాసనసభలో దళిత స్పీకర్‌ను తన ప్రజాప్రతినిధులతో అవమానకరంగా తిట్టించిన ఘనత కేసీఆర్, కేటీఆర్‌లదేనని, దళితులంటే కేసీఆర్ కుటుంబానికి ఎందుకంత కక్ష అని సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం వెలమ దొరలకు వత్తాసు పలుకుతున్న రసమయి బాలకిషన్ ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలని, లేకుంటే దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular