ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ శ్రీధర్ గౌడ్
వరంగల్ వాయిస్, నర్మెట్ట : మండల కేంద్రంలోని స్థానిక అంగన్‌వాడీ పాఠశాలలో మంగళవారం చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్మెట్ట గ్రామ సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన చిన్నారుల చేత ఓనమాలు దిద్దించి, వారి విద్యాభ్యాసానికి ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ.. చిన్నారుల జీవితంలో విద్యాభ్యాసానికి నాంది పలికే అక్షరాభ్యాసం ఎంతో కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. విద్య ద్వారానే వ్యక్తిత్వ వికాసం, సమాజ అభివృద్ధి సాధ్యమవుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, చిన్నారులందరూ ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం అక్షరాభ్యాసం పూర్తి చేసుకున్న చిన్నారులను ఆయన ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొలేపాక స్వామి, ఆగపేట సర్పంచ్ పగిడిపాటి రాజు, వార్డు మెంబర్ కొలెపాక యాదగిరి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శృతి, అంగన్‌వాడీ టీచర్లు రజిత కుమారి, బి. సృజన, శోభదేవి, స్వరూపరాణి, విజయలక్ష్మి, ఏఎన్‌ఎం కరుణ, ఆశా వర్కర్లు మంగ, స్థానిక నాయకులు చెప్పాల విజయ్, గ్రామ మహిళలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
