ఉప ముఖ్యమంత్రికి టీపీసీసీ నేత చిప్ప వెంకటేశ్వర్లు వినతి
వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు నేత ఆధ్వర్యంలోని చేనేత ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సూచనలతో డిప్యూటీ సీఎంకు వరంగల్ చేనేత కార్పెట్‌ను బహూకరించి, చేనేత కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. చేనేత ఉత్పత్తులకు 30% కూలీ రేట్లు పెంచినందుకు ప్రభుత్వం, టెస్కో యాజమాన్యానికి చేనేత సహకార సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చిప్ప వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో సుమారు 10,000 చేనేత కుటుంబాలలోని 50,000 మంది కార్మికులు కార్పెట్లు, బెడ్షీట్లు నేస్తూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. గత 40 ఏళ్లుగా ప్రభుత్వ సంక్షేమ శాఖలకు అవసరమైన బెడ్డింగ్ మెటీరియల్‌ను టెస్కో ద్వారా నిరంతరాయంగా కొనుగోలు చేస్తున్నారని గుర్తుచేశారు. అయితే, ఇటీవల ప్రభుత్వం సంక్షేమ శాఖలకు అవసరమైన 22 రకాల వస్తువులను ఏకీకృత టెండర్ విధానం ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించడం వల్ల చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఇందులో కార్పెట్లు, బెడ్షీట్లు మినహా మిగిలిన 20 రకాల వస్తువులు చేతివృత్తులకు సంబంధించినవి కావు.సంక్షేమ శాఖల బెడ్డింగ్ మెటీరియల్ (కార్పెట్లు, బెడ్షీట్లు)ను ఏకీకృత టెండర్ విధానం నుండి తొలగించి, యథావిధిగా టెస్కో ద్వారా చేనేత సొసైటీలకు ఆర్డర్లు ఇప్పించి కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించాలి. క్యాష్ క్రెడిట్ రుణాలు రద్దు: చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాలను రద్దు చేసి సొసైటీలను ఆదుకోవాలి. స్థానిక మంత్రి కొండా సురేఖ, టెస్కో అధికారుల హామీ మేరకు తాము గతంలో చేపట్టిన నిరసన దీక్షలు విరమించామని, సంఘాల్లో ఉన్న సరుకు కొనుగోలు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. భవిష్యత్తులో కూడా కార్మికుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ వినతిపత్రం సమర్పించిన వారిలో శత్రంజీ చేనేత సహకార సంఘం (కొత్తవాడ), వెంకటేశ్వర చేనేత సహకార సంఘం (ఎల్బీ నగర్, కొత్తవాడ) ప్రతినిధులు, చేనేత నాయకులు ఉన్నారు.
