Wednesday, April 22, 2026
HomeHanamkonda163 జాతీయ రహదారిపై ‘మృత్యు’ గుంత

163 జాతీయ రహదారిపై ‘మృత్యు’ గుంత

📰 Generate e-Paper Clip

వాహనదారుల బెంబేలు!

గూడెప్పాడు మార్కెట్ యార్డ్ సమీపంలో ప్రమాదకరంగా రహదారి

నాసిరకం పనులే కారణమంటున్న వాహనదారులు

కర్రను పాతి అప్రమత్తం చేసిన స్థానికులు

వరంగల్ వాయిస్, ఆత్మకూరు : నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే 163 జాతీయ రహదారిపై ఓ భారీ గుంత వాహనదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడు గ్రామ సమీపంలో, మార్కెట్ యార్డ్‌కు వెళ్లే దారి పక్కన రహదారిపై లోతైన గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ఇటీవలే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ హైవే రోడ్డు.. అప్పుడే ఇలా గుంతలు పడటంపై వాహనదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ చేపట్టిన నాసిరకం పనుల వల్లే రహదారి ఇలా కోతకు గురైందని, సంబంధిత అధికారులు పర్యవేక్షణలో విఫలమయ్యారని గ్రామస్తులు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ గుంత వాహనదారులకు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అతివేగంతో వచ్చే వాహనాలు ఈ గుంతలో పడితే ప్రాణాపాయం సంభవించే పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదాన్ని గమనించిన పలువురు వాహనదారులు మానవత్వంతో స్పందించి, ఆ గుంతలో ఒక కర్రను పాతి ఇతర వాహనదారులను అప్రమత్తం చేశారు. ఇప్పటికైనా నేషనల్ హైవే అధికారులు తక్షణమే స్పందించి, యుద్ధ ప్రాతిపదికన ఈ గుంతను పూడ్చివేసి పనులు చేపట్టాలని, పెద్ద ప్రమాదాలు జరగకముందే నివారణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

 

RELATED ARTICLES

Most Popular